స్వప్న సాకారపు అడుగులు వేద్దాం సాహసీ…

వొకానొక కార్తీక ప్రభాతాన యేవో యేవో ఆలోచనలతో వూహలతో నడుస్తోంటే శీతాకాలపు లేత సూర్యరశ్మిలా నా అరిచేతుల్లోకి వచ్చేసినవారు దొస్తోయేవ్ స్కీ.

దొస్తోయేవ్ స్కీ… మీకు తెలుసా… పేద ప్రజల అణిచివేత, నిజాయితీపరులైన పేదల జీవితాల్లోని విషాదం మీకు మీ వయస్సుకు మించిన చూపు కలిగినట్టే. పేదల ఆకలి, పేదరికం, వివక్ష, దోపిడీ అత్యంత పసివయస్సులోనే తన మనసుకి తాకిన సున్నిత మనస్కుడైన నా ప్రియ స్నేహితుడికి కలిగింది. నా స్నేహాన్ని చూసినప్పుడంతా మీరే గుర్తు వస్తారు. నా స్నేహంతో మాటాడినప్పుడు మీరెంతో గుర్తొస్తారు.

మీరు నా చదువరి జీవితాన్నే కాదు నా స్నేహమయి జీవనాన్ని అతుక్కొని వున్నారు. మా కలల సాకారపు దిశగా అడుగులు వేేసే వో స్ఫూర్తి ప్రదాత మీరు.

యెప్పటి రచనలు.. యిప్పటికీ నిత్య దీపమై చైతన్య దారులే.

1845లో వో వసంత కాలంలో తన మిత్రులకు, సన్నిహితులకు, యువ రచయిత డి.వి. గ్రిగొరోవివ్ కి దొస్తోయేవ్ స్కీ మొదటి రచన ‘పేద జనం’ ని చదివి వినిపించారు. సంతోషాన్ని అనుభవించేందుకూ, ఆత్మ గౌరవం కలిగివుండేందుకూ పేద ప్రజలకు హక్కు వుందని ‘పేద జనం’ స్పష్టీకరించింది.

శ్వేత రాత్రులు చదివినప్పుడు అప్పటి నాలోని బాలిక కళ్ళ ఆశ్చర్యం నాకింతా గుర్తే. స్వాప్నికుడు కష్టమైన జీవిత పరిస్థితుల్లోని నిరాశాపూరిత సామాన్య వాస్తవికతల నుంచి వో చిన్ని వుద్యోగి తనదైన స్వప్న ప్రపంచంలోకి తరలిపోతూ వుంటారు. యెటువంటి కలలు, వొంటరి స్వాప్నికుడు, వుదాత్త వీరుడు, యిష్టమైన పాత్రల్లోకి ప్రయాణించటం వో గమ్మతు అనుభవం. కానీ వాస్తవ జీవితంలో పటాపంచలయ్యే స్వప్నాలు… అంతేనా వా స్తెంకాతో పరిచయం అయినా అతను వొంటరే.

‘అవమానితులూ దూషితులూ’ చదివినప్పుడూ పేద జనంలో అతను కలగన్న స్వప్నాలు మన ముందుకు వచ్చిన ప్రతిసారీ కలల సాకారం వైపు ప్రయాణించాలంటే నిర్దిష్టంగా నిజాయితీగా మనలోని వో సాహసి వాస్తవంలో కూడా అడుగులు వెయ్యాలి.

‘‘ప్రజలీ భూమిపై అందంగా ఆనందంగా వుండగలరన్న సంగతి మీకు బాగ తెలుసు…’’ కానీ యిప్పటి సమాజానికే ఆ యెరుక లేనట్టుంది…

అందికే మిమ్మల్ని అంతా చదవాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి. నింపుకోవాలి. అడుగులు కలుసుకోవాలి. యీ భూమి భవిష్యత్ తరాలది కూడా అని ప్రజా సమూహాల మనసులో స్థిరమైన పోస్టర్ గా నిలిచిపోవాలి.

నేరమూ శిక్ష స్వభావాలు యెలానో మారిపోతున్న సమయాలివి.‘క్రైం అండ్ పనిష్మెంట్’ ని చదువుతూనే వుండాలి.

మీ పుట్టిన రోజుని తలచుకోవటం అంటే పేదరికం, ఆకలి, అన్యాయం లేని సమాజాన్ని నిర్మించే వైపు అడుగులు వెయ్యటమే కదా.

మీరిచ్చిన సాహిత్యానికి వినమ్ర నమస్సులు.

…….

వ్యాఖ్యానించండి