వెచ్చనిపొగ పరిమళాల జల్లులలో

వాన జల్లులు కాస్త మందంగా కురుస్తోన్న ఆ మధ్యాహానం సిటీ సెంట్రల్ మాల్ ముందున్న రైలింగ్ ని ఆనుకొని మిత్రుల కోసం యెదురు చూస్తున్నా… చిన్న మీటింగ్… యేం చర్చించాలాని ఆలోచిస్తున్నా… కానీ ఆలోచనలు తెగిపోతున్నాయి… మోటారు వాహనాలు రద్దీలో కిటకిటలాడే యీ నగరపు చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ లో యిరుక్కునే యీ అనుభవానికి యెటువంటి వాసన వుంది… డీసీల్, పెట్రోల్ పొగ కాలుష్యం… కాలుష్యపు వాసన  చుట్టుముడుతోన్నప్పుడు కురుస్తున్న వాన పరిమళం కాలుష్యపు వాసనని పోగొడుతుందా… వానకి ఆ కాలుష్యపు వాసన అంటుకొంటుందా… యేమో…  వాటినిమించి ఆ మాల్ కి వచ్చే వాళ్ళలో వాళ్ళు వాడే సుగంధ ద్రవ్యాల సమ్మిళిత సుగంధం. అవి యే సౌరభాలో గుర్తించే లోగానే  అలా వీచి యిలా వీచి మరోటి వీస్తోంది… యింతలో  మిత్రులు వచ్చారు.   

మీటింగ్ అయ్యేక మెల్లగా  నడుస్తోన్నా వాన కురిసి ఆగిన సన్నని యెత్తుపల్లాల సందుల్లోంచి.  ఆ రోడ్ మీదకి బేకరీ లోంచి బేక్ చేస్తున్న కప్ కేక్స్ , కేక్స్ తీయని గాలులు… టెస్ట్ బడ్స్ ని వూరించే ఆ సువాసనని వాళ్ళు గాల్లోకి వదులుతారా లేకా అలానే వస్తున్నాయా… రోజంతా యెలా వస్తాయి అలా…  ఆకర్షించడానికి వదిలినా సరే భలే కమ్మని వాసన. అందులోకి యిష్టంగా వెళ్ళకుండా ఆగలేం…

మరి కొంత దూరం వెళ్ళానో లేదో తిరిగి ఆషాడమాసపు అల్లీబిల్లీ మేఘాలు కురిపిస్తోన్న జల్లులు. చల్లని గాలుల్లోంచి వెచ్చగా వుబికి వస్తోన్న రాజేసిన బొగ్గుల సువాసన కాలుస్తోన్న మొక్కజొన్నల సమ్మిళితం మెల్లమెల్లగా తాకుతోంటే వొక బాల్యపు సువాసన కొమ్ముకుంటుంది. పరిమళం జ్ఞాపకాలని రాజేస్తుంది.

యిళ్ళల్లో ముఖ్యంగా మన అమ్మమ్మలకి పెళ్లుల్లు అయి కొత్తగా కాపురాలకి వచ్చిన కాలంలో కుంపటి రాజేసి పాలు మరిగించటం, పప్పు వుడికించటం, దానిమీదే యెసరు పెట్టటం యివి కొందరికి తెలిసిన అనుభవాలు. కుంపటి మీద కాచిన పాలు వుడికించిన పప్పు, కాచిన వెన్నా రుచే రుచి అని, అలానే  రోటిపచ్చడి రుచే రుచి అని చాల మంది మొగవాళ్ళు చెపుతుంటారు. మరి కొంతమంది యీ కాలంలో కూడా అప్పటి రుచులు వదులుకోలేక నా కోసం మా అమ్మ రోటి పచ్చడి చేస్తారు… మా ఆవిడ చెయ్యక పోతే నేనారోజు  అన్నం ముట్టనని చెపుతానమ్మా అని లో లొట్టసుకొని మరీ  కొంతమంది మొగవాళ్ళు చెపుతుంటారు. ముఖ్యంగా యెవరైనా మొగవాళ్ళు యిలా గర్వంగా చెపుతుంటే వీళ్ళకి కనీసపు సున్నితత్వం లేదే అనిపిస్తుంటుంది. విసినకర్ర పట్టుకొని విసిరారా. రోలు యెలా విసరాలో కూడా తెలియని వీళ్ళు ఆ కుంపటి రోలు చుట్టూ స్త్రీల శ్రమ యెంత వుంటుందో యెప్పుడైనా ఆలోచించారా… యెర్ర బడిన కళ్ళు…  కాయలు కాసిన చేతి వేళ్ళని యెప్పుడైనా గమనిస్తారా… ఆ రుచి తెలీయని యీ తరం నుంచి ఆ రుచి కావాలనే కోరిక మేరకి స్త్రీలు విముక్తి చెందినట్టే.

గులాబీ పువ్వుల వర్ణంతో పారదర్శకంగా చేతివేలు తగిలితేనే అంత పెద్ద గుండ్రని బంతి గోళీ అంత అయిపోయేది, నోట్లో పెట్టీ పెట్టగానే కరిగిపోయే పీచు మిఠాయి బాల్యాకాసపు నీడన మెరిసే తీయని యింద్రజాల జ్ఞాపకం. అలాంటి పీచు మిఠాయిని  మాల్స్ లో మల్టీ ఫ్లెక్స్ ల్లో  గాజు సీసాల్లో పాలథీన్ రేపర్స్ లో మొదటి సారి చూసినప్పుడు మార్కెట్ యెకానమీలో పాకింగ్ రోలు మరొకసారి అవగతమయింది.

చాల యేళ్ళ క్రితం మల్టీ ప్లెక్స్ ల్లో అమెరికన్ కార్న్ అమ్మటం మొదలు పెట్టారు. ఆ తరువాత కార్న్ సమోసా కార్న్ కట్ లెట్ కార్న్ చాట్ యిలా అమెరికన్ కార్న్ తో చేసే స్నాక్స్ తో కార్న్ పేరుతో చైన్ అవుట్ లెట్స్ వచ్చాయి. యిప్పుడు బళ్ల మీదా చిన్ని చిన్ని బేకరీల సైతం అవన్నీ దొరుకుతున్నాయి. పాకింగ్ తేడా. పరి శుభ్రత తేడా. ధర తేడా.  గోబల్ యేకానమీ యెప్పుడూ లోకల్  మార్కెట్స్ ని చిన్నా భిన్నం చేసేసి దబాయిస్తూ బతికేస్తుంటుంది. కానీ మన దేశంలో యింకా రోడ్ పక్కన బళ్లపై వండిన ఆహార పదార్ధాల అమ్మకం విపరీతంగా సాగుతూనే వుంది. వాటి జోలికి ప్రభుత్వాలు వెళ్లనందుకు సంతోషించాలి. రేపు యెవరైనా వీటి వలన తమ వ్యాపారానికి చేటు అనుకుంటే యీ బళ్లపై ఆహారం అమ్మటాన్ని నిషేదించినా ఆశ్చర్యపోనక్కర లేదు.  రోడ్స్ ని వెడల్పు చేసినప్పుడో, సూపర్ మార్కెట్స్ వచ్చినప్పుడో రోడ్ పక్కన  కూరలు అమ్ముకొనే అనేక మంది అక్కడ నుంచి మరో చోటకి వెళ్ళాల్సి వచ్చింది. యిప్పుడు అలా చిన్ని చిన్ని దుకాణాలు పెట్టుకోవటానికి వీలులేనప్పుడు  దాదాపు ప్రతి కాలనీలో కూరల సంత జరుగుతోంది.  మూడు రోజులకో వారానికో సరిపడే కూరలని యెంతో మంది కొంటున్నారు. అలానే దాదాపు ప్రతి బస్తీకి యెదురుగానో లోపలో సంత జరుగుతుంది. కూరలు, గాజులు, పిన్నులు, క్లిప్పులు, పూసల దండలు యిలా అనేక చిన్న చిన్న వస్తువులని అమ్ముతున్నారు. అవన్నీ కిటకిటలాడుతున్నాయి కూడా. 

యిలా రోడ్ల పక్కన దొరికే ఆహార పదార్ధాలకి వస్తువులకి మాల్స్ లో మల్టీ ఫ్లెక్స్ ల్లో  సూపర్ మార్కెట్స్ దొరికే వాటికి చాల తేడా వుంటుంది. బ్రాండ్ లేదు. యెడ్వర్టయిజ్ మెంట్ లేదు ప్యాకింగ్, ప్రజెంటేషన్ పూర్తిగా వేరు. యీ రెండు ప్రపంచాలకి చాల తేడా వుంది. అందరికీ అన్నీ అందుబాటులో వున్నట్టే కనిపించే నగరంలో అప్పుడప్పుడూ బొగ్గుల సువాసన ఆపి కాలుస్తున్న మొక్క జొన్న పొత్తుని తీసుకోమంటుంది. అక్కడ ఆ బండిపై కనిపించే కుంపటి పాలమీగడ రుచిని  పప్పు కమ్మదనాన్ని వూరిస్తునే ఆ తరపు స్త్రీలు యీ కుంపట్లతో, కట్టెల పొయ్యలతో రోజూలో  యెక్కువ భాగం వంట గదిలోనే గడిపేవారనే జ్ఞాపకంతో పాటు యిప్పటికీ అనేక మంది స్త్రీలు యింకా అలానే  కుంపట్లతో కట్టెల పొయ్యలతో గడుపుతున్నారనే వాస్తవం మనసుని బాధిస్తుంది.

యెర్రని బొగ్గుల కుంపటి మీద మొక్క జొన్న పొత్తులని కాలుస్తుంటే  వచ్చే కమ్మని వాసనకి, కావాలి కావాలి అని టెస్ట్ బడ్స్ అంటుంటే  ఆగగలరా… యీ మధ్య చాల చోట్ల బండి మీద యిడ్లీ పాత్ర ల్లో ఆవిరితో మొక్కజొన్నపొత్తులని వుడక పెట్టి అమ్ముతున్నారు. అసలే వర్షాకాలం… ఆ నీళ్ళు యేమిటో యెక్కడివో అని వాటిని చూసి వాపోతున్న వాళ్ళు వున్నారు. అసలే ఆషాడ మాసం  యీగల మోత.

మొక్క జొన్న పొత్తులని యిలా వుడికించటం యింతకు ముందెప్పుడూ యింతలా చూడకపోవటంతో యే కమ్మని వాసనా లేని వాటిని కావాలని అడగటం లేదు టేస్ట్ బడ్స్. యెన్నియెలా మారినా మొక్కజొన్న పొత్తులని కుంపట్లో బొగ్గులపై కాలిస్తే వచ్చే సువాసనేవేరబ్బా…

చలో… కేకో, మొక్కజొన్న పొత్తో… మన బాల్యపు పరదాల్లో చుట్టుకొని మనలని మైమరిపించే ఆ సువాసనల కోసం మోటారు వాహనాల రద్దీలో కిటకిటలాడే యీ నగరంలో  వెతుకుదాం ఆ పరిమళపు రోడ్లని… మనందరి జీవన తాత్వికత మనస్సులో వెంటాడే యిలాంటి బాల్యపు రుచులలోనే వుంటుందేమో…

వ్యాఖ్యానించండి