పిల్లలకు జేజేలు. పిల్లలకు కృతజ్ఞలు.

చిన్న చిన్న పిల్లలు ఆడుకోవాలి. పాడుకోవాలి. చిన్నచిన్న పనులు చేయాలి. సీతాకోక చిలుకల్ని రెక్కలతో పట్టుకొని దీక్షగా పరిశీలించాలి.పెద్దలు సమాధానం చెప్పలేని అనేక ప్రశ్నలు అనేకం వేయాలి. అన్నిటికి మించి వాళ్ళు అల్లరి చెయ్యాలి. అల్లరి అంటే హుకుంని ధిక్కరించడం, మంకు అంటే మనం జీర్ణం చేసుకున్న హేతువుని నిరాకరించడం.

పిల్లలపై పెద్దల దాడిని కాస్త వాయిదా వేయమని అడుగుదాం. యెదగడానికి తొందర పడవద్దని, మరి కాసేపు పసితనపు అభయారణ్యంలో విహరించమని వారిని వొదిలేద్దాం. అందుకోసం యేo చేయాలో చేయమని అడుగుదాం.

బాల్యం వొక అంతరించిపోతున్న అపురూప వనం. దాన్ని పరిరక్షిద్దాం, పిల్లల కోసం, వారు పెరిగి పెద్దయీ పెద్దల ప్రపంచంలోకి తెచ్చే శైశవ పరిమళం కోసం.

పిల్లలకు కృతజ్ఞతలు. పిల్లలకు జేజేలు.

మీరు ముద్దుముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో యీ లోకంలో తిరుగాడుతుండడం వల్ల కదా పూలు పూస్తుందీ. గాలి వీస్తున్నదీ. యింకా రుతువులు నిలిచినదీ, ఆకాశం యింద్ర ధనస్సులు చిత్రిస్తున్నదీ! సెలయేరుల్లాంటి నవ్వులతో లోకంలో ని పెనుచీకటిని ప్రమిదల్లా తొలగిస్తుంది మీరు. మీరు మా కడుపున పుడతారన్నది అబద్ధం. మీతో ఆడీ పాడీ మేమే కోట్ల సార్లు కొత్తగా పుడుతుంటాం. పిల్లల్లారా మీరు యీ ప్రపంచపు జీవశక్తి, ప్రాణవాయువు.

పిల్లలకు కృతజ్ఞతలు.

పిల్లలకు జేజేలు.

పిల్లలకు బోలెడన్ని ముద్దులు.

వ్యాఖ్యానించండి