
అప్పుడప్పుడు ఆ రోజులు బాగున్నాయి అనిపించే సందర్భాలు కొన్నింటాయి.
చిన్నప్పటి నుంచి యెన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆ వనవాసిలో సత్యచరణ్ లా కొన్నాళ్ళు యే అరణ్యానికో వెళ్ళి అతను చెప్పిన అరణ్య ప్రకృతిదేవత తాలుక పలురూపాలు చూడాలనిపిస్తుంది. అలానే యుగళ ప్రసాద్ అడివి అంతటా యెన్నెన్నో రకాల కొత్తకొత్త విత్తనాలని తీసుకొచ్చి అడివిని పూలతోటగా పరిమళభరితం చెయ్యాలని ఆకాంక్షిస్తాడు. ఆ అరణ్యంలోని ధూసరవర్ణ శీర్షరేఖ, ధూదలి పుష్పాల పరిమళం, ధగద్దగాయమాన వెన్నెల రాత్రుల కోసం వనవాసులమే గుర్రమెక్కి పారిపోతే బాగుండుననిపిస్తుంది.
మనసు అలా మోహనపురా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా పూర్ణచంద్రబింబాన్ని స్వప్నిస్తుంటే… వుదయమే నగరంలో వుదయించే అరుణబింబం కోసం తూర్పు యెటుందోనని మొబైల్లో కాంపస్ తీసినప్పుడు, గుబురుగా పెరిగిన మామిడి చెట్ల మధ్య నుంచి వుదయపు సూరీడు వరండాలోకి మెల్లమెల్లగా కాంతి పరదాని కప్పుతూ మనకి యెదురొచ్చే ప్రభాతుడు గుర్తు వచ్చి, అప్పుడెప్పుడో ప్రహారీ గోడ గేట్ కి పక్కగా వాకిట్లో వొక మామిడి చెట్టు వున్నట్టు యిప్పుడూ మనకి అచ్చు అలాంటి వాకిలి మామిడి చెట్టుతో సహా వుంటే బాగుండుననిపిస్తుంది.
సూపర్ మూన్ లేదా నెలకోసారి వచ్చే వెన్నెల నగరపు విద్యుత్ తళతళల్లో వెలతెల పోతుంటే, పొడవాటి కొబ్బరి చెట్ల ఆకుల రెపరెప నీడల్లోంచి వెన్నెలా అలాఅలా ముఖం మీద పడుతుంటే నర్గీస్ గారు, రాజ్ కపూర్ గారిలా ‘ఆజా సనం మాధుర్’ అని పాడుకొన్నట్టు మనమూ వాళ్ళ లా ఫీల్ అయిన రహస్యాంతరంగపు కాలం గుర్తొస్తే యిప్పుడు మనకీ మన పెరట్లో అలా వొక కొబ్బరి చెట్టు వుంటే బాగుండుననిపిస్తుంది.
కిటీకీ తలుపులు బిగించి నిండుగా కర్ట్ న్స్ వేలాడదీసి ఆటోమేటిక్ లాక్ వున్న గుమ్మం తలుపు వేసేసుకొని యే సి ఆన్ చేసి రూమ్ ఫ్రెష్ నర్ సువాసనని పీలుస్తుంటే, అప్పుడెప్పుడో మెట్ల మీదుగా డాబా పై వరకు పాకిన జాజిమల్లో సన్నజాజో, ఆకుపచ్చ సంపెంగో వూదా రంగు ఆకాశం నల్లని ఆకాశమై, తిరిగి తెల్లని ఆకాశమయ్యే వరకు తెరచి వుంచిన కిటికీలోంచి మన గదిలోకి మోహపు పరిమళాలని రెపరెపలాడిస్తోంటే తెరచిన కిటికీ వున్న పడకగది వుంటే బాగుండుననిపిస్తుంది.
మనం యింటికి వచ్చే సరికి తలుపు గొళ్ళెంకి విడి పువ్వులువున్న తెల్లని పోలిథిన్ కవర్ వేళ్ళాడుతూ చూసినప్పుడో వుదయమే వేకువ గాలికి వికసించిన యెర్ర మందారాలు… తెల్లని ముద్ద నందివర్ధనాలు, తెలుపు, గులాబీవర్ణపు గులాబీలు, నిత్య మల్లెపువ్వులతో యమ్మేస్ గారి కౌసల్యా సుప్రజారామ ప్రతి శనివారం వుదయం రేడియోలో వింటూ అమ్మ యింటిపాది కోసం చేసే పూజల కోసం యింటి చుట్టూ తిరుగుతూ, వొక్కో సారి పొరిగింటి గోడ మీద నుంచి యిటు వాలిన పువ్వుల కి మనమే హక్కుదారులమని పూర్తిగా నమ్మి కోసి యిచ్చిన పువ్వులతో వెలిగిపోయే పూజ గది గుర్తొ స్తే అలా నాలుగు వైపులా పూల మొక్కల వుండే నేల వున్న యిల్లు వుంటే వుంటే బాగుండుననిపిస్తుంది.
కూరకాయలో కరివేపాకో నిండుకున్నప్పుడు వాటి కోసం బిగ్ బాస్కెట్ కి ఆడర్ ప్లేస్ చెయ్యాలని అనిపించినప్పుడు చెంగుచెంగున తెంపుకొచ్చిన పెరటిలోని నిలువెత్తు కరివేపాకు చెట్టు నేలంతా రాల్చిన నల్లని కాయలు గుర్తొ వచ్చినప్పుడు అలాంటి చెట్టున్న పెరడు వుంటే బాగుండుననిపిస్తుంది.
యివే మంత పెద్ద కోరికలు. యెండా వాన మన ముంగిట వాలాలి అనుకొంటున్నాం… అంతే కదా… కానీ యివి చాల అపురూపమైన సంపదైయ్యాయి.
ముసురుకొంటున్న పరాయి క్షణాలు గుర్తు పట్టటానికి మనకంటూ పరిమళవంతమైన కొన్ని సొంత క్షణాలుండాలి. అవి మన కళ్ళ ముందే కదిలిపోతుంటే మనకి దిగులేస్తుంది. వాటిని యెలాగైనా గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది. కాని రమ్యబంధపు తాళం చెవులున్ని మనం అభివృధి చేతికి అప్పగించి చాల యేళ్ళు అయింది.
యిన్నేళ్ళలో నగరంలోనే పుట్టి పెరిగిన పిల్లలకి యిలాంటి క్షణాలు కావాలనిపించవు. యెందుకంటే వారికి ఆ అనుభవం లేదు. చుట్టూ నిలువెత్తు అపార్ట్మెంట్స్… వుదయించే సూరీడుని చూడాలంటే తూర్పు యెటో తెలియని పరిస్థితి. అలానే మట్టి పరిమళం తెలిసే అవకాశమే లేదు.
కొన్నాళ్ళ క్రితం కథా రైటర్స్ మీట్ కి చిలుమూరు బయలుదేరాం. తెనాలి రైల్వే స్టేషన్ నుంచి ట్రావెల్స్ బస్సులో చిలుమూరు వెళ్లుతున్నాం. మధ్యలో కృష్ణ గారి వూరు బుర్రిపాలెం వచ్చింది. కృష్ణ గారి అభిమానులు ‘అబ్బా! సూపర్ స్టార్ కృష్ణ గారి వూరు అని డిష్యుం డిష్యుం కళ్ళతో వుత్సాహంగా చూసారు. మహేష్ బాబు గారి తండ్రి గారి వూరంటూ మహేష్ బాబు గారి అభిమానులు యెవడి దెబ్బ తగిలితే అనుకొంటూ కేరింతలతో ఆ వూరిని చూసారు. పాటలని యిష్టపడే నాకు ‘అన్నీ మనకు వచ్చే పోయే చుట్టాలే, చుక్కలతో చెప్పాలని యిటు చూస్తే తప్పని, నేనొక ప్రేమ పిపాసిని… అబ్బో… కృష్ణ గారి సినిమాల్లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాటలు యెన్నెన్నో గుర్తు వచ్చాయి. అలానే మహేష్ బాబుగారి సినిమాలో ‘యిప్పటికింకా పదహారేళ్ళే పాట గుర్తొచ్చింది.
పదహారేళ్ళు వొక అబ్సెషన్… అనేక రకాలుగా… ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’ అని ఆ వూయాలపై శ్రీదేవిగారు వూగటం యేమో కానీ మనసు యిప్పటికీ అలా వూగుతూనే వుంది. ఆ పాటంటే వెర్రి యిష్టం. కృష్ణగారి పాట ‘గలగల పారుతోన్న గోదారిలా’ ని మషేష్ బాబు గారి సినిమాలో చూసినప్పుడు కృష్ణ గారి అభిమానులు యీలలు వేసే వుంటారు… మల్టి ఫ్లెక్స్ లో చూసా… అక్కడ యీలలు వినబడువుగా… సో అలా ఆ బుర్రే పాలెం నుంచి చిలుమూరు చేరుకున్నాం. చుట్టూ ఆకుపచ్చని వరి పొలాలు. అరటి తోటలు. తమలవృక్షాలు… వాటి నడుమ స్కూల్.
నగరాల్లో కార్పోరేట్ స్కూల్ విద్యార్ధిని విద్యార్ధులని వొకసారి వ్యవసాయం మీద అవగాహన కోసం యిక్కడికి ఆ కార్పోరేట్ స్కూల్ వాళ్ళు తీసు కొచ్చారంటా. పిల్లలు హ్యాండ్ గ్లోవ్స్ లు మొకాళ్ళ వరకు బూట్లు వేసుకుని ఆ పొలాల్లో వరి నాటడానికి సంసిద్ధం అయ్యారంటా. యివన్నీ యేంటి యెందుకు అని యిక్కడ పొలాల్లో పని చేసేవారు చేయించే వారు ఆశ్చర్య పోయారంటా. మట్టి బురదా కాళ్ళకి అంటుకోకుండా బూట్లు కావాలి కదా, అలానే చేతులతో వరి నాట్లు వెయ్యాలి కదా అవి యేవీ లేకుండా మీరెలా పనిచేస్తారు… హైజనిక్ కాదు కదా… అని విద్యార్ధినీ విద్యార్ధులు ఆశ్చర్య పోయారంటా. పట్నం పిల్లలు కదా యివి నిజంగానే కావాలేమో… నూతన వ్యవసాయ పని విధానంలో భాగంగా అలాంటివి వచ్చా యేమో పట్నం వాళ్ళకి యెక్కువ తెలుస్తాయి కదాని వాళ్ళు మారు మాటాడ కుండా వీళ్ళని చూస్తుంటే వో పెద్దాయన ‘యిదేవి చోద్యం కాళ్ళకి మట్టి అంటటం పరిశుబ్రత కాదా ఆ తొడుగులేంటి తినే చేతికి నాటే మొక్కకి మధ్య చేతి స్పర్శ లేకపోతే యెలా’ అంటూ తన పదాల్లో వాపోతూ ఆశ్చర్య పోయారంటా. పిల్లలు తమ రక్షణ కవచాలతో పొలం లోకి దిగారంటా. ఆ నీళ్ళు నిండిన మట్టిలో ఆ బూట్లతో నిలబడటానికి బేలన్స్ కుదరక వొకొక్కరే ఆ బూట్లు తీసేసారంట. ఆ గ్లవ్స్ తో వరినారు నాటటం వీలుకాదని అవి తీసేసారంట. మోకాళ్ళ వరకు మోచేతుల వరకు మట్టి కమ్ముకొన్న వారి శరీరాలని పిల్లలు చిత్రంగా చూసుకున్నారు. తొలి మట్టి స్పర్శ వారిలో చిత్రమైన సంతోషం.
తరువాత యింత లావు నీటి బోరు బావి దగ్గర ఆరు బయట స్నానాలు… పిల్లల కేరింతలే కేరింతలంట. రోజు స్కూల్లో యీత కొడతారు సిమ్మిం సిమ్మింగ్ ఫూల్లో… ఆ అనుభవానికి యీ అనుభవానికి తేడా పిల్లలకి మొదటిసారి అనుభవంలోకి వచ్చింది.
వాన వచ్చే ముందు గాలిలో తేలివచ్చే వాన వాసనని, తొలివాన కురిస్తే మట్టి పరిమళాన్ని మన అనుభవంలో వుంటే మనం గుర్తు పట్టగలం. లేకపోతే యేదో వాసననో లేదా కొంతమంది అది అసలు పరిమళంగా కూడా గుర్తు పట్టలేరు.
మనం అందరిలానే ఆ కాలానికి సంబంధించిన వృతిలో యింజినీరుల్లానో, డాక్టర్స్ గానో, జర్నలిస్ట్ ల్లానో, లెక్చరర్స్ గానో, లాయర్లగానో ఐయేస్, ఐపియస్, నర్స్ లు, కానిస్టేబుల్స్, రైతులమో యిలా అనేక వృత్తుల్లో మనం కొనసాగుతూ యింటి పనులు చేసుకొంటూ యిలా దైనొందిన జీవితాల్లో నడుస్తునో, పరిగెడుతునో వాన కురిసే ముందు వీచే గాలినో ,వో కొత్త పుస్తకపు నవ్య పరిమళాన్నో స్వాసిస్తూ సాయంకాలపు దీపం వెలిగిస్తునో వున్నప్పుడు మనకి మనం నడిచి వచ్చిన దారుల్లో యే యే ప్రపంచాలు మనలో యింకి వున్నాయో అవి వొక్కొక్కటిగా మనలని చుట్టు ముడతాయి. వొక్కోసారి నవ్విస్తాయి. అప్పుడప్పుడు దిగులుని నింపుతాయి. కొన్ని సార్లు వాటిని తిరిగి తెచ్చేసుకోమంటాయి.
అది సాధ్యం కాదనే యెరుక మనకి వుండటంతో తెచ్చుకోవచ్చనే కలని మనం కనటానికి ధైర్యం చెయ్యలేం. కానీ వొక్కో సారి మాటాడాలనిపిస్తుంది ముఖ్యంగా ముందు తరాల పిల్లలు కళ్ళ ముందు మెదులుతుంటే అభివృద్ధి రాంగ్ టర్్స తీసుకుంటున్నప్పుడు తెలిసినవి కొన్ని చెప్పాలనిపిస్తుంది… లేదా సూచించాలనిపిస్తుంది…
యెలా అంటే మరీ అవసరానికిమించిన ఆకాశ హార్మాన్యాలొద్దు. వాన నీరు యింకడానికి కాసింత మట్టి నేలని వదులుదాం. వాన నీరు ప్రవహించే నాలాల్ని నివాసం కోసం మింగైవొద్దు. మనుష్యులు నడవడానికి సరైన పేమెంట్స్ ని ప్లాన్ చేద్దాం. వాహనాల వేగం తగ్గిద్దామని వేసిన స్పీడ్ బేకర్స్ నడిపేవారికి కనిపించక పడిపోతుంటారు… అలా పడిపోకుండా అవి కంటికి పగలు రాత్రి కూడా కనిపించే విధంగా యేర్పర్చి బోర్డ్ స్ పెడదాం… ముఖ్యంగా కాస్త గాలి వెలుతురు వచ్చేట్టు యిళ్ళని కట్టుకొనెట్టు యిక ముందు కట్టే యిళ్ళ ని ప్లాన్ చేసుకుంటే మనసుని తడిపేసే నాలుగు దిక్కుల పరిమళాలు పిల్లల అనుభవంలోకి వస్తాయి… అవి వారి జ్ఞాపకాల కేన్వాస్ పై చిత్రాలై రంగులు చిమ్ముతాయి. ఆశో అత్యాశో … యిక్కడ సహజమైన కోరికలు పొసగవని దాటి వచ్చిన దారుల్లోకి వెళ్ళలేమనే యెరుక వున్నా అప్పుడప్పుడూ ఆ రోజులు బాగున్నాయి అనిపించే సందర్భాలు యింకా మనసులో వున్నందుకు మనం వనవాసులమే ఆ సత్యచరణ్ లా యుగళ ప్రసాద్ లా…
——————
