కిటికీ అద్దాల మీద రిఫ్లెక్ట్ అవుతున్న నీరెండ. కారిడార్ ల్లో వో మూలకి పెట్టిన మనీప్లాంట్ తీగ పక్కకి వొరిగి అప్పుడప్పుడూ బయట గాలికి వూగుతుంది. రాత్రి వానకి తడిసిపోయిన కాంక్రీట్ గోడలు. చెమ్మకి పెచ్చులూడిపోయిన పిస్తాగ్రీన్ గోడలు. లిఫ్ట్ నిండా, మెట్లంతా చేరిన రాత్రి వాన తాలూక నీరు యింకా అప్పుడప్పుడూ కిందకి జారుతోంది. అపార్ట్ మెంట్ ఆఫీషియల్ వాట్స్అప్ గ్రూప్ లో మేస్సేజస్ వస్తున్నాయి ఆ యా ఫ్లాట్స్ వాళ్ళ నుంచి. వై ఫై కనెక్షన్ తెగిపోయింది రాత్రి వానకి. డేటా వాళ్ళు యింత కన్సూమ్ అయిందని అలర్ట్స్ పంపుతున్నారు. వాటిని పెద్దగా పట్టించుకోకుండా మెసేజస్ చూస్తున్నా.
పోర్టికోలో కార్లు బయటకి వెళ్ళడానికి వీలులేకుండా బయట నీళ్ళు వున్నాయని. చెట్లు విరిగి పడి వున్నాయని. యిళ్ళ ల్లోకి నీరు చేరటం వల్ల యీ రోజు హౌస్ కీపింగ్ వాళ్ళు రాలేదని. యిళ్ళల్లో పనివాళ్లు రాలేదని, పవర్ రాకపోతే సరిపడా డీసిల్ వుందా జనరేటర్ కి అని యిలా అనేక మేస్సేజస్ మధ్య రాత్రి పడిన వడగళ్ళు అని వాన ప్రేమికులు యెవరో వొక పిక్చర్ పోస్ట్ చేసారు. ఆ పెద్ద పెద్ద వడగళ్ళ ని చూసి రకరకాల కామెంట్స్. ఫోన్ మూసేసాను.
రాత్రి వాన! అదేం వాన… వొక్కసారే వెయ్యి యేనుగులు సుడిగుండంగా వొకే సారి తిరుగుతున్నట్టు నల్లని గాలి వొక్కసారిగా… వెంటనే వేలవేల ట్రక్కుల్లో పెద్దపెద్ద కంకరరాళ్ళు బోర్లిస్తున్నట్టు దడదడా చప్పుడు. మెరుపులు. వురుములు… ఆ చప్పుడు యేమిటని సెక్యూరిటిని అడిగితే ‘అవేనమ్మా తెల్ల రాళ్ళు పడుతున్నాయి’ అన్నాడతను.
వడగళ్ళా… నాకు భలే సరదా వాటిని చూడటం… కానీ నాకు ఆ శబ్ధం చూస్తుంటే సరదా వెయ్యలేదు. స్నో వైట్ కథ గుర్తు రాలేదు. నాకు చప్పున గుర్తు వచ్చిన వాళ్ళు పార్క్ చుట్టూ అనేక మంది పడుకొని వుంటారు ప్రతిరోజూ. అనేక రకాలైన వైద్యం కోసం వచ్చిన వాళ్ళు. ట్రీట్ మెంట్ జరుగుతున్న వాళ్ళు. అప్పటికి పన్నెండు దాటలేదు. చాల మంది రోడ్ల పైనే వుంటారు. ఆ చప్పుడు వాన ఆగవేం.
యెలా వున్నావ్ అని నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. యెక్కడ వున్నారని కొన్ని కాల్స్ చేసా. వానొస్తే యిదొక ఆదుర్ధా. యెవరు యే రోడ్ మీద చిక్కుకున్నారోనని. రోడ్లన్నీ జల మయం అయిపోతాయి. తెల్లవారు ఝామున ఆ వాన తగ్గింది.
చెయ్యాల్సిన రిపేర్లు క్లీనింగ్ చేస్తున్నారు నగరమంతా యీ అపార్ట్ మెంట్ లో చేస్తున్నట్టే.
***
తిరిగి యెర్రని యెండా. హఠాత్తుగా మబ్బేసింది.
‘అమ్మో వానొచ్చేట్టు వుంది జరస్కూల్ కి ఫోన్ చెయ్యాలమ్మా బాలెన్స్ లేదు అని ఫోన్ తీసుకొని స్కూల్ కి ఫోన్ చేసి మా పిల్లల్ని స్కూల్ అయిపోయాక బయటక పంపకండి. నేనొస్తా… మా యింటి కాడంతా నీరొ చ్చేస్తాది… మ్యాన్ హోల్స్ మూతలు తీసేస్తారు… కొన్ని చోట్ల అసలు మూతలే లేవు అంటున్న లక్ష్మి.
‘వానొస్తే యిల్లంతా నీళ్ళే… సామానంతా మునిపోతాయి… యెవరి బట్టలు వాళ్లకి యిచ్చి వెళ్ళాలి యిస్త్రీ అయినా కాకపోయినా రాత్రి వానకి అలానే చాల బట్టలు తడిసిపోయాయి… పట్టు చీరలు కూడా వున్నాయి’ అంది స్వరూప.
‘రేకుల యిల్లు కదా, కాస్త యెండని కాస్తాదని చెట్లు పెడితే అదేం గాలోనమ్మా యెప్పుడూ కొమ్మలు విరిగి యింటి మీద పడటం, ఆ రేకులు విరిగిపోవడం… నెత్తి మీద పడకుండా చూసుకోవటమే సరిపోతోంది వానొస్తే…. చిన్న చిన్న పిల్లలు…’ వాపోతోంది యాదమ్మ.
‘యింత వానని యెప్పుడూ చూడ లేదు… భయమేసేసింది… మా యిద్దరం యేడుస్తూనే వున్నాం భయంతో… పెద్ద శబ్ధం అపార్ట్ మెంట్ మీద ఫిక్స్ చేసిన హోర్డింగ్ పడిపోయోయి బిల్డింగ్ వూగిపోయింది’ సిలిగురి నుంచి యిక్కడ బ్యూటీ పార్లర్ ల్లో పని చెయ్యడానికి వచ్చిన గంగా, మేఘా చెపుతున్నారు.
‘వానొస్తే చాలు పార్కింగ్ అంతా నీళ్ళే కార్లన్నీ మునిగిపోతున్నాయి… సర్వీసింగ్ కే డబ్బులన్నీ పోతున్నాయి… యీ కార్ అమ్మేసి వూబర్ లో వెళితే సుఖం’ అంటున్నారు మిసెస్ దీపా అగర్వాల్.
‘రాత్రంతా నిద్ర లేదు… కరెంట్ పోయింది. యీ వానలోస్తే నిద్ర కరువు… అయినా అదేం వానబ్బా గుండె ఝల్లుమంది’ అంటున్నారు కొలీగ్ రమేష్.
భయానికి జెండర్ లేదు.
దాదాపు ప్రతి యేడాది కొన్నేళ్లుగా రాత్రిలాంటి భీభత్స మైన వొకటి రెండు వానల్ని యీ నగరం చూస్తోంది. వసంతవాన యెంత మృదువైన పేరు… కానీ భలే వైల్నెంట్. గాలి వానల్ని వరదల్ని చూసిన నాకే భయం భయంగా అనిపిస్తే అసలా అనుభవం లేని వారు మరింత భయపడుతునే వున్నారు.
వానకి నిర్వచనాలు మారుతుంటాయి. వేసవి వాన అన్నింటిని ఆసాంతం తలకిందులు చేస్తుంది. వైల్నెంట్ గా వస్తుంది. అలాంటి వానని చూసాం యీ యేడాది. అంతలోనే రుతుపవనాల సందడి.
మొత్తానికి వానొస్తే నగరం వులిక్కి పడుతోంది. భయపడుతోంది. నగరం నలుదిక్కులా వానొచ్చినప్పుడు పగటి కష్టాలు పగటివి. రాత్రి కష్టాలు రాత్రివి.
నిజమే కొన్ని చినుకులు, బోలెడంత గాలి నగరంలో సృష్టిస్తున్న భీభత్సం అంతాయింతా కాదు. యెందుకలా నగరపు వాన విసిగిస్తోంది.
అదే మేఘం అదే వాన. అదే నేల. కానీ మరీ యీ భయాలు ఆందోళనలు యెక్కడ నుంచి వస్తున్నాయి. చిక్కంతా నేలతో వచ్చింది. నీరు ప్రవహించే చోటులేని రోడ్లు. యిల్లు. అపార్ట్మెంట్స్. షాపింగ్ కాంప్లెక్స్ లు. మాల్స్ వొకటా రెండా… అనేక ఆక్రమణలు… యిల్లల్లోకి చొచ్చుకొచ్చే ఫ్లై వోవర్స్. మెట్రో స్థంబాలు. కొట్టేసిన కొండ రాళ్ళు తరిగిపోయిన గుట్టలు. మూసుకు పోయిన చెరువుల్లోకి నీళ్ళు వెళ్ళే దారులు, మొక్కలు పాతి వాటి చుట్టూ సిమ్మేంట్ తాపడం చేసేసి నాలాలన్నీ మింగేసి చెయ్యాల్సిన దానికంటే యెక్కువగా నగరపు భూమితో మిస్ బిహేవ్ చేసేస్తూ వానని ఆ డిపోసుకోవటమెందుకు… నిజానికి యీ దేశపు నగరాలన్నీ అలానే వున్నాయి. అపార్ట్ మెంట్ టెర్రస్స్ లపై వానొస్తే బయటకి వెళ్ళే యేర్పాటు కూడా చెయ్యలేని డిజైనర్స్ రిమోర్ట్ తో తెరుచుకునే తలుపులు పెడతామంటారు. మరిన్ని రింగ్ రోడ్స్ మరిన్ని ఫ్లై వోవర్స్ తో నగరపు ట్రాఫ్ఫిక్ ని నియంత్రిస్తాం అంటారు అధికారులు. వాటన్నిటి కంటే ముందు నాలాల సంగతి, మ్యాన్ హోల్స్ విషయం, నింగికి యెగిసేట్టున్న హోర్డింగ్స్ యిలా నగరాన్ని అతలాకుతలం చేస్తున్న విషయాల పై చూపు పెడితే నగరం వొక్క వానకే అల్లాడిపోదు. మనసు తడిసి ముద్దవుతుంది ఆదుర్ధా లేకుండా లేదంటే అభివృధికి ఆనవాలు కట్టడాలే అనుకుంటే మరిన్ని వరదలు. మరిన్ని కూలడాలు. వానవరదల్లో యిళ్ళల్లోనే చిక్కుకున్న ప్రజలు. పెద్దల పర్యటనలు… కవరేజ్ లు షరా మామూలే. వాన ఆగుతుంది. అంతా ముంచేసి నీరు ఆవిరవుతుంది. యింక ఆ వైపు చూసే వాళ్ళే వుండరు. మళ్ళీ వాన మళ్ళీ కవరేజ్… అచ్చు రుతువుల్లో పూసే పువ్వుల్లానే అవే కష్టాలునష్టాలు ప్రతి యేడాది. అలవాటు పడిపోతాం..
.కానీ ఆ భయం ఆదుర్ధా మనోదేహాలపై చూపిస్తున్న అనారోగ్యం, కోల్పోయిన యిల్లు, వస్తువులు వొక్కోసారి నీటపాలైన విలువైన ప్రాణాలు యివన్నీ లెక్కలోకి తీసుకొంటే యీ విషయాలపై నిరంతరం దృష్టి పెట్టాల్సిన వారంతా పెడితే వానంటే భయపడక్కరలేదు కదా.
.మధ్యానం కురిస్తే వేడివేడి పకోడీలు, వుదయమైతే చిక్కని కాఫీ లేదా గుమగుమలాడే చాయ్, రాత్రి వేళల్లో చల్లని యిస్ క్రీం రుచి చూసే వాళ్ళం. వాన చప్పుడు వింటూ దుప్పటిని మరింత పైకి లాక్కుని ముసుగేసి పడుకునేవాళ్ళం రాత్రంతా. పిల్ల కాల్వల్లో కాగితప్పడవలు పిల్లలతో వేయించే వాళ్ళం. వాళ్ళతో మనమూ పసి వాళ్ళమై మరిన్ని పడవలు వాళ్ళతో పోటి పడి వేసే వాళ్ళం. యెంచక్కా మణిరత్నంగారి హీరోయిన్లా పాడుకునే వాళ్ళం. ‘ఆజ్ మౌసమ్ బడా బేయిమాన్ హై…’ అనో ‘కురిసింది వాన నా గుండెలోన’ అనో అబ్బాయిలు హమ్ చేస్తారు కదా. పిల్లలు ‘రైన్ రైన్ కం టుడే’ అని పాడుకొంటారుగా.
వసంతవాన సోయగపు వింత కాంతి అలాఅలా వెళుతుంటే వొక బెంగ… కదిలిపోతున్న రైలు కిటికీ దగ్గర నిలబడి ఆప్తులకి చేయి వూపుతోన్నలాంటి బెంగ. కనుమరుగవుతున్న రైలుని చూస్తూ వెనక్కి తిరగ్గానే మరో ట్రైన్ నుంచి అదే ప్లాట్ ఫాం మీదకి దిగిన ఆప్తుల్లా తొలకరి మృదువైన స్పర్శ ముఖమంతా.
తొలకరి ఆగమనపు మబ్బు కమ్మిన సుగంధం వెదురువనాల మీదుగా నగరమంతా పరుచుకొంటుంటే యెరుపెక్కుతోన్న గుల్మొహర్ రేకల పూల గుత్తుల్లోంచి గిరికీలు కొడుతూ తూనీగలు వానోస్తుందనే సంకేతపు సరదాని నమ్మకంగా చెపుతున్నాయి.
‘రాత్రి వచ్చిన రహస్యపు వాన’ అన్నారు వజీర్ రహ్మాన్ గారు… వానని యిష్టపడని వారుండరు. కొండశిఖర సానువుల పై నుంచి జలపాతమై కురిసే వాన. ఆకుపచ్చని లోయల వాలులమ్మట పాయల్లో సుళ్ళు తిరిగే వాన. సెలయేటి గులకరాళ్ళ నడుమ ప్రవహించే వాన. మైదానాల్లో యేక ధారగా కురిసే వాన. వూరేగింపుగా మేఘాలు కొండకోనల్లు దాటి పల్లెలని చిత్తడి చిత్తడి చేస్తూ, నగరాలలో సన్నాయి గీతాలై కురవటానికి వస్తున్నాయి.
ఆరుద్రలు తడి నేలపై మెల్లమెల్ల గా కదిలితే, సోమరి వానపాములు మరింత ముడుచుకు పోతుంటాయి. చీకటి సంగీతపు హోరుగా కప్పల బెకబెకలు. విప్పారే మయూరాలు. అల్లిబిల్లిగా యెగిరే వాన పిట్టలు. చెట్లన్నీ తలారా స్నానం చేసిన చెట్లకి లోలకుల్లా వేలాడుతున్న రంగురంగు పువ్వులు. ముస్తాబవుతోంది నేలానేలంతా సువిత్తనధారియై మొలకెత్తడానికి. యేరువాక పాటలు సరి చేసుకుంటున్న స్త్రీల గొంతులు. వో యింద్రచాపం కోసం కవి యెండావాన మేఘాన్ని దిగంతం మీద అరగదీస్తుంటే ఆ వెలుతురుని కేన్వాస్ మీద వొంపటానికి చిత్రకారులు కుంచెను వొడిసి పట్టుకున్నారు.
వానొస్తుందేమో… యిప్పుడు వాక్ కి వెళ్ళకపొతేనే మంచిదేమో… రోడ్ మీద ట్రాఫిక్ లో యిరుక్కుంటే… గాలి వస్తే… వాతావరణం మారిపోయింది… మనం చేతులారా చేసుకొంది యిలా రకరకాల భయందోళనలు సంశయాలు… అబిప్రాయాలు వాట్స్ అప్ గ్రూప్స్ లో…
వాక్ కి వెళ్ళి పూర్తి చేసుకొని పువ్వులు కొంటున్నా అక్కడ వరసగా వున్న చిన్నిచిన్ని గంపల్లో కూరలు పళ్ళు పూలు చూస్తూ.
పనస పళ్ళ తీయని గాలి వీస్తున్న వైపు చూసా.
ఆ గరగారా పండుని కత్తితో వొలిచి తొనలని తీయటాన్ని పసిఆసక్తితో గమనిస్తున్న వో చిన్నారి ‘‘ నేను తీస్తా’’ అని పండు వలుస్తున్న అతన్ని అడుగుతుండగా, వుదయపు నడక ముగించుకొని అక్కడికి వచ్చిన అతని తల్లితండ్రులు “వద్దోద్దు… చేయ్యంతా గమ్ అవుతుంది’ అని వారిస్తుంటే “యేం కాదు… ఆయిల్ రాసుకొని కట్ చేస్తున్నారు అంకుల్. ఐ వాంట్ టు ట్రై’’ స్పష్టంగా చెప్పాడు చిన్నారి.
‘‘చెయ్యి కట్ అయితే’’ అడుగుతోంది తల్లి.
‘‘యేం కాదు… కేర్ ఫుల్ గా వుంటా… ఐ వాంట్ టు లెర్న్’’ మరింత దృఢంగా చెప్పాడా చిన్నారి.
అలానే ఆ చిన్నారినే చూస్తున్నా.
‘భయాన్ని అతను లెక్క చెయ్యటం లేదు. అలానే పెరిగుంటాం కదా అంతా… మరి భయం మనలని ఆక్రమించకుండా వుండే నర్వ్ ని యెక్కడ పోగుట్టుకున్నాం … నగరపు భౌతిక ఆక్రమణల గురించి ఆలోచిస్తున్నాం కానీ మనలని ఆక్రమిస్తున్న భయాలని గుర్తించి మనం వాటిని అడ్రస్ చెయ్యాలి కదా… లేకపోతే వానలాంటి చిన్నిచిన్ని ఆనందాలకి అడ్డుకట్ట వేసుకున్నట్టేగా… ప్రయత్నించాలి…
వో చినుకు… మరో చినుకు. మనసులోనే యీల వేసుకొంటూ పువ్వులు పట్టుకొని అడుగు వెంట అడుగు చినుకు వెంట అడుగు.

