
శ్రావ్య సుప్రభాతం.
నిన్నా మొన్నా అటు మొన్నా యిలా రోజులు గడిచిపోతుంటాయి యెప్పటిలానే
మనిద్దరం వొకరి కళ్ళల్లోకి వొకరు చూసుకోకుండా…
కలిసి కూర్చుని Marquez నో.. బిభూధినో మళ్ళీ మళ్ళీ పలవరిస్తుంటాం చూడు… అలా కలబోతల పలవరింత లేకుండానే వుదయాలు గడుస్తున్నాయి.
వుదయమే రంగురంగుల కవిత్వపుపూలతోటల నుంచి నువ్వు యెంచిన వొక కవితని… నే నిద్రలోంచి కనురెప్పలు విప్పేసరికి నా కళ్ళ ముందు వుంచుతావు చూడు… ప్రభాతాన్నే వో రమ్య భావనని చూడటం మృదువుగా మన దినచర్య మొదలవ్వటం శ్రావ్య సుప్రభాతం.
ఆకుపచ్చని నీడల మాటున మెల్లమెల్లగా కదిలే నది వొడ్డున కూర్చున్న మనల్ని సున్నితంగా నిమురుతూ మనలో రాత్రి విపార్చిన కలలని చెప్పమని వినటానికి – బుజ్జి పిట్ట చెవొగ్గి.
నది పొడవైన చూపులతో మన ముందు కూర్చుంటే… పండిన పనసపళ్ళ తీపిగాలులు… విచ్చుకొన్న అనేక వర్ణాల పూవ్వులూ, ఆ కొమ్మాపూలు యీ కొమ్మాపూల మీద వాలుతూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న పసుపచ్చని చిన్నిచిన్ని పిట్టలు తేనే పెదవులతోనే మన చుట్టూ చేరేవి మన కలలని వినడానికి.
యిప్పుడవన్నీ గుర్తు వచ్చి సంతోషపు శక్తినిస్తోంది. బట్ … యిప్పుడు పనుల వల్ల… మనిద్దరం తలో చోటా… కలిసి పంచుకోవలసిన మార్నింగ్ కాఫీ ఆరోమాని పక్కనే మీరున్నట్టు నేనూ.. నేనున్నట్టు మీరు మనద్దరం యీ వేకువన మనలోని మనతో సాగిస్తోన్న యీ అందమైన రహస్య సంభాషణ చుట్టూ దిగులు ప్రదక్షణలు చేస్తూనే వుంది.
యెటు చూసినా దిగులు మేఘాలు…
దా… త్వరగా…
…
