‘జీవితాదర్శం’ – శాంతి

రెడ్ బ్యాంగిల్స్

“మొదటినించీ లాలస ప్రత్యేకమైన స్త్రీ అని తెలుసు.ఆమెని చూస్తుంటేనే జీవితం యెంత లోతో, యెంత అందమో, చాలా నేర్చుకుంటాము. ఆమె ఈ మాల్వoకర్ పాల యెట్లా పడ్డదా అని నా ఆశ్చర్యం. కల్పించుకొని ఆమెని మాల్వాoకర్ దగ్గర నుంచి వెళ్లిపోమన్నాను. కానీ వెళ్లనంది. గొప్ప వ్యక్తులoదరిలో వుండే గుణాలు కష్టాలలలో సహనం, తను ప్రేమిoచే మనిషి స్వర్గానికి మారతాడనే ఎడ తెగని విశ్వాసం, తాను మార్చ గలననే ధైర్యం అమరిమితం ఆమెలో. జీవితాన్ని ఎక్కువగా చూసినవాణ్ణి కావడం వల్ల ఆమె ఆశలన్నీ వ్యర్ధమని తెలిసి అవసరమైనప్పుడు జన్మకి, ఆమె మిత్రుడినని చెప్పాను వెళ్ళే ముందు”” … అంటారు దేశికాచారి.

ఆ తరువాత లాలస అతని దగ్గరకు వచ్చేస్తుంది.

“ఏ శాంతిని భగ్నం చేసే ఏ సుఖమూ, ఏ గొప్పతనమూ నా జీవితానికి చాల విరోధం. అంటే శాంతిని భగ్నం చేసేది సుఖమూ కాదు. గొప్పతనమూ కాదు. శృంగారమూ కాదు”… అంటారు దేశికాచారి.

దేశికాచారిలో “ప్రేమకి అతీతమైన శాంతి, ఎందుకంటే ఆయనకి కోర్కెలూ భయాలు లేవు. బాధని తప్పించుకోవడoలో నేర్పరి. కానీ బాధని చూస్తే భయం లేదు. ఆయన హృదయంలో శాంతి, ఆకాశంలోమల్లే. గొడవపడకు. నేను రాను” సింగ్ తో అం టుంది లాలస.

లాలస ఛాయిస్ ని గౌరవిస్తాను అని దేశికాచారి చెపుతారు.

ఆమె పట్ల ప్రేమతోనే చెపుతారు.

వొక వేళ లాలస సింగ్ తో వెళ్ళిపోతే అతని మనసు దిగులు పడుతుందా…

పడుతుంది… తనలో తానే కంపిస్తుంది…

స్త్రీ నిర్ణయంని లేదా పురుషుల నిర్ణయంని గౌవరించటంలో హుందాతనము ప్రేమించే హృదయంకి మాత్రమే సాధ్యం అవుతుంది… దేశికాచారికి అర్ధమైనట్టు…

చలంగారి రచనలు యెప్పుడు చదివినా వో కొత్త చూపుని యిస్తాయి. యేదో వొకటి చదివి చలం గారు యిందులో యేమి చెప్పారని యెవరైనా యోచిస్తే చలంగారు మనతో కానీ వారికి వారు కానీ యేమి అనుకుంటున్నారో అవగతం కారని నా అభిప్రాయం. అనుభవం.

యీ మధ్య ‘జీవితాదర్శాన్ని’ చదివినప్పుడు యింతకు ముందు కలగని దుఖమేసింది. మామూలుగా

కాదు. చేదుగా అయిపోయింది శ్వాసంతా. ఆ నా దుఖానికి హేతువు యేమిటాని నేనేం పెద్దగా ఆలోచించలేదు. ఆ ఆలోచన తెగేది కాదు.

కానీ మొదటి సారి… ఆ తరువాత ‘జీవితాదర్శం’ చదివినప్పుడు యేమనిపించిందాని అప్పుడు

రాసుకొన్న నోట్స్ తీసి చూసుకొన్నా.

‘’భలే భీమ్లీ… నీలి కెరటాలు… ఆ గాలి… ఆ వొడ్డున నడకా… ఆ కొండ మెట్లు… త్వరత్వరగా నడిచే మనిషేవ్వరూ కనిపించలేదే’’…

అలా యింకా వుంది.

మరో సారి చదివినప్పుడు…

‘యిటు వంటి ప్రయాణం సాధ్యమా… అసలు యిలా జీవితానికి చూపునివ్వగలిగే స్త్రీ పురుషులు వొకరికొకరు తారసపడటం అన్నది వో కల. వూహా… ముఖ్యంగా యిప్పటి ప్రపంచంలో… కనిపిస్తారా… కనిపిస్తే…’’యిలా మరి కొన్ని భావాలు ఆలోచనలు…

అని నోట్స్ చివర రాసుకొన్నా.

కానీ యెప్పుడు యిలా దుఖంగా బరువుగా గ్లూమీగా అనిపించినట్టు లేదు.

యెటువంటిదీ వేదన!

అన్వేషించే హృదయాల ప్రవాహం అచ్చు నదీ ప్రవాహంలానే వుంటుoదనుకొంటాను.

ఆయా రుతువుల బట్టీ… ప్రవాహగమనం సాగుతుంటుంది. శ్రావణ మేఘాలు మృదువుగా కురిస్తే నది కొండాకోనల జలధారతో గలగలా కొత్త నీరుతో వుత్సాహంగా వొడ్డున వున్నవారికి కన్నులానందంగా సాగిపోతుంది. అదే శ్రావణమేఘం వున్మత్త మేఘమైతే అడ్డూఆపూలేని నది తీరాల్నిదాటి వూళ్ళని వూళ్ళని నాశనం చేసేస్తుంది. తెలిసిన నది నిత్యం మనం నమ్మిప్రేమించే నదీ యిలా విరుచుకుపడిందని మనం బిత్తరపోతాం. అప్పటి నుంచి ఆ వరదవైపే కాదు ఆ నది వైపే అపనమ్మకంగా చూస్తోన్న మనకి యీ మొత్తానికి హేతువు యేమిటని ఆలోచిస్తే కొన్ని కారణాలు యేవో తడతాయి. కానీ అవి సంపూర్ణం కాదు. యిప్పుడు మన యెదురుగా జరిగిన భీభత్సం మళ్ళీ జరగకుండా వుండటం యెలా లేదా అసలా భీకరమే వొద్దు… మన పాదాలని చిన్నిచిన్ని అలలతో తడిపే వో మృదువైన లలితమైన తీరం కోసం అన్వేషించటమో… కానీ ఆ మనోవుధృతి వ్యామోహం యేమంత సులువుగా వదిలేది కాదు.

‘జీవితాదర్శం శాంతి’ అని మీకు మీరు తెలుసుకొన్నది లాలస అనుభవంలోకి మాత్రమే వొంపారా దేశికాచారి… మాకూ చెప్పినట్టే వున్నారు… కానీ మిమ్మల్ని చదువుకొని… మిమ్మల్ని ప్రేమించే మా లోకమింకా పడుతూలేస్తూ పడుతూనే వున్నట్టుంది… జీవితానుభావాల్లోకి అనువదించుకోని సాహిత్యపు ప్రేమెందుకు… ప్రేమకి మించిన శాంతి… శాంతికి మించిన ప్రేమా… యింకా యెంత ప్రయాణం చేయ్యాల్లో మనోఅంతరాలకు…

యింతకీ నాకెందుకంత దుఖమేసింది దేశికాచారి గారు…!

……….

వ్యాఖ్యానించండి