రెడ్ బ్యాంగిల్స్

ఆకుపచ్చని వెన్నెల

….

వో నెలవంక సాయంకాలం

కవికోకిల ప్రాంగణంలో ఆ పొడవాటి వరండాలో నలుపలకల స్తంభానికి వారి కుడి భుజాన్ని కాస్త ఆనించి ఆ వెన్నెలవంక వైపు కనురెప్పలు పైకెత్తి శివసాగర్ గారు చెప్పారు కదా…

ఆకాశంలో నెలవంక

నెలవంక నెలవంక

ఆకాశం నెలవంక

నెలవంక సొర చేప

సొరచేప పసిపాప

పులివిప్పి నెమలి కొండ

పులివాగు రెల్లు దుబ్బు

నా మల్లియ రాలెను

నీ మొగిలి కూడా రాలేను

నా మల్లియ, నీ మొగిలి ఆకాశం చేరెను

….

చందమామ లోకంలో

ఛాoగ్ ఓ ఏకాంత దేవి…

ఆకాశం చేరెను..

వో ట్రాన్స్ లో వారు వొక్కో కవితావాక్యం వొక్కో కవితగా యేమా గొంతు… మాటల్లోకి అనువదించలేని ఆర్తి మాధుర్యం…

నా చెమ్మగిల్లిన కళ్ళకి నెలవంక వెలుగు కనిపించలేదు. పూర్ణ కవితా జాబిల్లి దర్శనమిచ్చింది.

మరిన్ని కవితావాక్యాలు చెపుతోంటే మీటింగ్ మొదలై హల్లోకి వెళ్లాం.

….

తెలిసిన వాటి కంటే నాకు తెలియని విషయాలే అనేకం.

నా ప్రశ్నలూ సందేహాలు చేంతాడంత… యెప్పుడు కలిసినా యేo అడిగినా వుద్యమాల గురించి అయినా కవిత్వమైనా వాదాల గురించైనా చెప్పేటప్పుడు పాట పాడినంత మాధుర్యమే ఆ గొంతులో. నేనెంత అవగాహన పెంచుకున్ననో తెచ్చుకున్నానోనని అప్పుడప్పుడూ ఆలోచిస్తున్నప్పుడు వారి నుంచి కవిత్వమైనా మరిన్ని విషయాలలోనైనా తెలుసుకున్నదాని కంటే తెలుసుకోకుండా వున్నదే యెక్కువని తెలుస్తూనే వుంటుంది. కానీ వారిచ్చిన అవగాహన చూపు విలువైనవి.

అడివివెన్నెల సౌందర్యం గొంతoతా పాటైన ప్రియమైన కవీ మీకు ఆకుపచ్చని వెన్నెల నమస్సులు.

…..

వ్యాఖ్యానించండి