ఇళయరాజా గారిని తలచుకోవడమంటే…
ఆషాడమాసంలో తొలి వాన కురిసినప్పుడు భూమిలోంచి వెచ్చగా జనించే భూసుగంధాన్ని గుండెల నిండుగా ఆఘ్రాణించే అగరుపొగ లేతసవ్వడిని వినటం కదా…!
శ్రావణపు సాయంకాలాల్లో యింటి అరుగు మీద కూర్చుని చూరు మీద నుంచి కురిసే బిందువుకి బిందువుకి మధ్యనున్ననిశ్శబ్దంని వినటం కదా…!
హేమంత సమయాల ధూసరవర్ణపు మేఘ ఛాయల్లో నదీ ప్రవాహాలకి చామంతుల అంచులనినేస్తున్న గులకరాళ్ళ సవ్వడిని వినటం కదా…!
శిశిరంలో లోయలంతటా ప్రభవించే మంచుపూలవనాల్లో సున్నితంగా కమ్ముకునే గాలి యీలల కిలకిల వినటం కదా…!
శరత్కాలపు రాత్రుల్లో అరణ్యమంతా కమ్ముకొన్న వెన్నెల్లో అడివిపూల తీపిగాలుల మాధుర్యంలో ప్రియమైన వారి చేతుల్లోచేతులు పెనవేసి వెండివెన్నలరాగాలని కలిసి వొకే శ్వాసగా వినటమే కదా…!
అంతేనా వూహు…!
కిన్నెరసాని వెన్నెల పయిట వేస్తే – యవ్వనోత్సాపు లాలిత్యాన్ని కురిపించాలి అన్నా…
కథగా కల్పనగా కనిపించెను – చాలు కదా యీ దొరసాని దొరవారు అనిపించిన క్షణం వొక్కటి కావాలన్నా…
మాటే మంత్రమూ మనసే బంధం – మనసు పెనవేయ్యాలి అన్నా
అసల్లేo తోచదు కన్నుల ముందు నువ్వు లేకున్న- బెంగని వొంపాలి అన్నా…
నిన్నెవరూ కొట్టారు – గుండెని లాగిపెట్టి వదలాలి అన్నా…
ప్రేమ మోహం వియోగం అనుభందం సంతోషం కలలూ వూహలూ అల్లరి చిలిపితనం బాల్యం దుఖం యవ్వనోత్సాహం… what not..!
మన సమస్త జీవితాన్ని పాటల్లో నింపిన ఆ చేతి వేళ్ళకి స్వరం వొంచి నమస్కారిస్తూ…
ఆ పాటలే లేకపోతే నిస్సందేహంగా మనలోని వో అర వెలితిగానే వుండేది. రంగుల రాగాల పాటలోత్సాహంగా వారూ పల్లవిస్తూ మనకి ప్రతి క్షణం జీవనోత్సాహమైయ్యారు.వారి పాటలు మనలో మన దైనొందిన జీవితంలో భాగంగా వుండటం వో సెలబ్రేషన్..
.వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
వేలవేల పాటలు… బోలెడు యిష్టమైన పాటలు… యెoపిక సులువేం కాదు… కానీ పాట మన మూడ్ కదా… అచ్చంగా మన కోసం యిలా గుండెల్లో పక్కనే గుండెగా వున్నప్పుడు…. వీలైతే వినండి… మన మనసైన పాటని …

